జ్ఞాన భాస్కరుడు
అజ్ఞానాంధకార జగతికి జ్ఞానభాస్కరుడు
కుల వ్యవస్థను నిరసించిన నిమ్నజనోద్ధారకుడు
ఛాందస భావజాలాన్ని తూర్పారబట్టి
తన వాదనాపటిమతో మనువాదాన్ని పాతర పెట్టిండు
పుక్కిటి పురాణ గాథల్ని ఎండగట్టి
అగ్రవర్ణ ఆధిపత్య ధోరణికి ప్రశ్నగా నిలిచిండు
తన సతీమణి సావిత్రీబాయి ఫూలేతో కలిసి బడుల్ని నెలకొల్పి
గుడిసె గుడిసెలో అక్షర దీపమై వెలిగిండు
నిరాశా నిస్పృహలతో కొట్టుమిట్టాడే జనావళి శరీరాల్లో
చైతన్య దీప్తిని రగిలించిండు బ్రాహ్మణీయ భావజాల సంకెళ్లను తెంచి
శాస్త్రీయ దృక్పథానికి ఊపిరిలూదిండు
అవతారాల గుట్టు విప్పి
బహుజన తాత్విక దృక్పథాన్ని పెంపొందించిండు
మానవుడే మాధవుడను నినాదంతో
కుహనావాదుల కుట్రలను జ్ఞానఖడ్గమై ఛేదించిండు
గూడు కట్టుకున్న సంకుచిత భావాలను
సమూలంగా తుడిచిపెట్టి
సంస్కరణ దృక్పథ బావుటాను ఎగరేసిండు
మహాత్ముడంటేనే జ్యోతిబాపూలే
అవరోధాలను అధిగమించిన కార్యసాధకుడు
కీర్తి శిఖరాలను అధిరోహించిన మహనీయుడు
మనందరి గుండెల్లో కొలువైన మహాత్ముడు
( మహాత్మా జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా…)
- డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య
No comments:
Post a Comment