........ గురువులు..........
చడీ చప్పుడు కాకుండా
మట్టిలో మాణిక్యాలను
వెలికి తీస్తున్నారు వాళ్ళు
చదువుల సామ్రాజ్యంలో
తళుక్కున మెరిసే వజ్రాలకు
సాన పడుతున్నారు వాళ్ళు
గొంగళి పురుగులకు రంగులద్ది
సీతాకోకచిలుకలను
పైకెగరేస్తారు వాళ్ళు
ఎగరలేక ఎగురుతూ
తటపటాయిస్తున్న పక్షులకు
నిచ్చెనై పైకెక్కిస్తారు వాళ్ళు
సందడి చేయని సరిగమలకు
ప్రాణమై సరాగాలను
నేర్పే పనిలో ఉన్నారు వాళ్ళు
రాతి బసవన్నలను
ఉలితో తీర్చిదిద్దుతూ
శిల్పాలుగా మార్చుతున్నారు వాళ్ళు
నదిలా సాగే జీవనగమనంలో
దిక్కు తోచని ప్రవాహానికి
ప్రాజెక్టై దిశా నిర్దేశం చేస్తారు వాళ్ళు
ఎన్నెన్నో జీవితాలకు
వెలుగులు పూయించే
సూర్య తేజ గురువులు వాళ్ళు
వాళ్ళిప్పుడు
సినిమాల కొంటె చేష్టలకి
నవ్వుల పాలౌతున్నారు
వాళ్ళిప్పుడు
ప్రజలముందు దోషులుగా
చిత్రీకరించబడుతున్నారు
కరుగుతున్న కాలగమనంలో
వేకువ కోడై మేల్కొల్పాల్సిన వాళ్ళు
యాప్ ల వెంట పరుగులు తీస్తున్నారు
చాక్ఫీస్ పట్టే కొనవేళ్ళు
కంప్యూటర్ నైపుణ్యం పై
ఉనికిని తెలియజేయాల్సి వస్తుంది
మేం దొంగలం కాదని
రాని నవ్వును తెచ్చుకొని
కెమెరా ముందు కళ్ళు కొట్టాలి వాళ్ళు
అసలు కంటే కొసరు పనులకే
ఉన్న సమయం చాలక
ఇంట్లోనూ పాఠశాలను కలవరిస్తుంటారు వాళ్ళు
.........................✍️ ఆవుల చక్రపాణి యాదవ్
9963350973
No comments:
Post a Comment