Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

11 October 2024

మనిషి మర్మము తెలిపే తెలంగాణ రుబాయిలు-కళ్లెం ధనోజ

మనిషి మర్మము తెలిపే తెలంగాణ రుబాయిలు-కళ్లెం ధనోజ                  -భావవీణ monthly, 2024 

నరసింహారెడ్డి గారు 1968 ఏప్రిల్ 6 వ తేదీన ఏనుగు కృష్ణారెడ్డి,లక్ష్మమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా,రామన్నపేట మండలం కల్లోనికుంట గ్రామంలో జన్మించారు. నరసింహారెడ్డి  జన్మించిన మూడేళ్లకే తండ్రి కృష్ణారెడ్డి  టి.బి. వ్యాధితో మరణించారు. తల్లి లక్ష్మమ్మ  నరసింహారెడ్డిని తీసుకుని హైదరాబాద్ లోని తార్నాకకు వెళ్ళింది. అక్కడ ఇబ్బందులు ఎదురు కావడంతో చిట్యాలకు వచ్చి స్థిర పడింది. 

        నరసింహారెడ్డి చిట్యాలలో 10 వ తరగతి, రామన్నపేటలో ఇంటర్ పూర్తి చేశాడు. సికింద్రాబాద్ లోని సర్ధార్ పటేల్ కాలేజీలో డిగ్రీ ప్రథమ సంవత్సరం, నల్గొండ నాగార్జున డిగ్రీ కళాశాలలో ద్వితీయ, తృతీయ సంవత్సరాలు చదివారు. ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. చేసి,  

తెలుగు విశ్వవిద్యాలయంలో 

ఎం. ఫిల్, పీహెచ్డీ పూర్తి చేశారు.

          గజల్, రుబాయి కవితారూపాలు పారసీ భాష నుంచి ఉర్దూలోకి ప్రవేశించాయని కొందరు, అరబ్బీ నుంచి వచ్చాయని మరికొందరు  అంటూ ఉంటారు. కసీదా, గజల్, కతా అనే మూడు రూపాలు అరబ్బీ, ఫారసీ రెండింటిలోనూ మొదటి నుంచి ఉన్నాయి. రుబాయి, మస్నవి ,తర్జీయా అనే మూడు రూపాలు ఫారసీలోనే ఉన్నాయి. ఉర్దూ గజళ్ళు, ఉర్దూ రుబాయిలు- అనువాదాల ద్వారానే మొదట తెలుగువారికి పరిచయమైనాయి. రుబాయి రచన ఎంత సులభమో మంచి రుబాయి నిర్మాణం అంత కష్టం. రుబాయిలో ప్రధానంగా ఒకే ఒక్క భావం ఉంటుంది .ఈ భావ ప్రసూనం నాలుగు రేకులుగా విచ్చుకుంటుంది. 

1. మొదటి పాదంలో భావం మొగ్గతొడుగుతుంది. 

2. రెండవ పాదంలో కొంచెం  విచ్చుకుంటుంది. 

3.  మూడవ పాదంలో వినూత్న   

         అభివ్యక్తితో ఉబికి వస్తుంది.    

         హృదయాన్ని సంభ్రమాశ్చర్యాలలో      

          ముంచెత్తుతుంది. 

4. ఇక నాలుగవ పాదం రూబాయిలోనే అతి ప్రధాన భాగం. ఇందులో పై మూడు పాదాల సారం ఇమిడి ఉంటుంది. మొదటి పాదంలో అంకురించిన భావం సమగ్రంగా గుబాళిస్తుంది.ఈ ముగింపులోనిదే 

కవి ప్రతిభ,చమత్కృతి,ప్రౌఢిమ ప్రస్ఫుటం అవుతాయి. అందులో మన కవి గారు ఏనుగు నరసింహారెడ్డి గారు వంద శాతం నెగ్గారు. 


       తెలుగులో తొలి గజళ్లను, తొలి రుబాయిలను రాసిన వారు డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యుల వారు. దాశరథి గారి తరువాత పట్టుదలతో తెలుగు రు బాయిలను రాసి అనేక సంపుటాలను ప్రచురించిన వారు డాక్టర్ తిరుమల శ్రీనివాసాచార్యులు గారు. దాశరథి, తిరుమల శ్రీనివాసాచార్య గార్ల తరువాత అధిక సంఖ్యలో రుబాయిలను రాసిన వారు ఏనుగు నరసింహారెడ్డి. 

తెలంగాణ సాహిత్యంలో ఉర్దూ, ఫారసీ భాషల ప్రభావం అధికంగానే ఉంటుంది. ఇక్కడి వాళ్లకు గజల్, రుబాయి ఖసీదా,మర్సియా, మస్నవి మొదలైనవి పరిచయమే! అందుకే డాక్టర్ సి.నారాయణరెడ్డి గారు 

*"ఇచట తెల్గుల వాణి ఇచట ఉర్దూబాణీ కలిసిపోయినవి ముక్తా ప్రవాళములట్లు"**


అన్నారు. అందువల్ల ఏనుగు నరసింహారెడ్డి రుబాయిలు రాయడం ఈ నేల స్వభావంలో భాగం. కాబట్టి నరసింహారెడ్డిని కవి అనకుండా *షాయర్* అనవచ్చు. వీరు రాసిన రూబాయిల్లో అక్కడక్కడ కొన్ని ఉర్ధూ మాటలను రదీఫులుగా పెట్టుకున్నారు కూడా. 

ఉదా: 

*ఏదంటే అదయిద్ది పాబందుంటే*

*ఎప్పుడంటే అప్పుడయిద్ది పాబందుంటే*

*మాట మీద నిలబడటం చాలా కష్టం* 

*ఆత్మబలం వృద్ధయిద్ది పాబందుంటే**

ఇందులో అదయిద్ది, అప్పుడయిద్ది, వృధ్ధయిద్ది అనేవి ఖాఫియాలు, పాబందుంటే అనేది రదీఫ్.  ఒకటి, రెండు, నాలుగు పాదాలకు ఈ ఖాఫియా, రదీఫ్ లు తప్పకుండా ఉండాలి. ఇవి తెలుగులో అంత్యప్రాసల లాంటివి కావు.  మూడవ పాదం స్వతంత్రంగా ఉంటుంది.  దానికి రదీఫ్, కాఫీయాల పాబంది ఉండదు.  కానీ ఈ ఒకటి, రెండు, నాలుగు పంక్తులను అనుసంధానించేది మూడవ పంక్తి. దానితో కలుపుకుని చూస్తే రుబాయి నాలుగో పాదం త కలుక్కుమని మెరుస్తుంది. ఉర్దూ మాటలతోనే కాకుండా నికార్సైన తెలంగాణ మాటలను కూడా ఈ కవి రదీఫ్ ఖాఫీయాలుగా వాడుకున్నారు.


*వాడకుంటే గండ్రగొడ్డలి మొండి వార్తది* 

*దూయకుంటే విచ్చు కత్తి మొండి వార్తది* 

*సాధనొకటే సకల కళలకు మూలశక్తి* 

*రాయకుంటే పదునుపాళీ మొండి వార్తది*


ఈ రుబాయిని చదివినప్పుడు నా భవిష్యత్తు గుర్తుకు తెచ్చారు కవిగారు.  ఇక్కడ గొడ్డలి , కత్తి, పాళి ఇకారాంత హల్లులు- ఖాఫీయాలు అయితే; మొండివార్తది అనేది రదీఫ్. రుబాయి అనగానే తటాలున గుర్తుకు వచ్చే పేరు *ఉమర్ ఖయ్యూం.* రాశిలో చాలా తక్కువ రాసినా వాసిలోఎంతో గొప్పవి ఆ రుబాయిలు. 

వాటిని కవికోకిల  దువ్వూరి రామిరెడ్డి గారు తెలుగులో అనువాదం చేసినారు.. యాదృచ్ఛికంగానే ఉన్నా వారు కూడా రెడ్డి గారు కావడం విశేషంగా  చెప్పుకోవచ్చు. రామిరెడ్డి గారు ఉమర్ ఖయ్యూం రుబాయిలను పానశాల పేరుతో ప్రచురించారు.


       తెలంగాణ రుబాయిల గురించి మాట్లాడుతున్నప్పుడు తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసిన హజ్రత్ అమ్జద్ *హైదరబాదీ* రుబాయిలను తలుచుకోవడం అనివార్యం.

 *జిల్లా అమర్ మె చాలా ముఝే  మామూన్ కియా*

*మస్రూర్ కబీ,జార్ కబీ రంజూర్ కియా*

*మై ఖుద్రత్ క కభీన భాషలు హాలూ*

*లేకిన్  మజ్భూరియోంనే మజ్భూర్ కియా*


అలాగే తెలియదు అనే దానికి హజ్రత్ అమ్జద్ గారు "ఖుదాకీమర్జీ" అన్నారు. మన వేదాంతంలోనూ ఇది వున్నది. సంస్కృతంలో "తేనవినాతృణ మపినచలతి" అంటే  అతని ఆజ్ఞ లేనిదే గడ్డి పోచ కూడా కదలదు అని.  హజ్రత్ అమ్జద్ గారు అన్నది! 


"*తఖ్ధీర్ సెగిలాక్యా ఖుదాకీ మర్జీ*

*జోకుచ్భీహువాహువాఖుదాకీమర్జీ*

*అమ్జద్ హర్ బాత్ మే కహాతక్  క్యోంక్యుం*

*హర్ క్యూమ్ కి హై ఇస్తే హాఖుదాకి మర్జీ* 

  

       అలాగే పుట్టడం మన చేతిలో లేదు. చావాలనుకుంటే ఎంతో గుండె ధైర్యం కావాలి. కానీ ఎప్పుడో అప్పుడు పోక తప్పదు. ఇటువంటి ఒక రుబాయీలో అమ్జద్ ఇలా అన్నారు. 


   *కిస్ మతన్ కి తఫ్సీర్ హూ మాలూమ్ నహీ*

*కిస్ హాత్ కి తహ్రీర్ హూ మాలూమ్ నహీ* 

*మై హూ కె మేరే ప్రదేశ్ మే హై ఔర్ కోయి*

*సూరత్ హూ కె తస్వీర్ హూ మాలూమ్ నహీ*  


       పైన తఫ్సీర్, తస్వీర్ అనేవి ఖాఫీయాలైతే మాలూమ్ నహీ అనేది రదీఫ్. ఇలాగే నరసింహారెడ్డి గారు తెలియదు అని  ఇటువంటి సూఫీ భావం గల రుబాయీని రాసారు.


 *అతడు ఎక్కడున్నాడో నాకు తెలియదు*

*మనం ఎక్కడున్నామో సైతము తెలియదు*

*వాడు తెలుసంటాను వీడు తెలుసంటాను* 

*ఇంతకు నేనెవడనో  ఇప్పటికీ నాకు తెలియదు*


           ఇందులో *అతడు* అంటే భగవంతుని గురించి చెప్పడం అన్నమాట. నిరాకారుడు, నిర్గుణుడు అయిన ఆ చిదానంద స్వరూపున్ని  గురించి చెప్పేది, ఇక్కడ అతడు, వాడు, అన్ని సర్వనామాలే వున్నాయి. ఇవి మనం ఎలా అర్థం చేసుకుంటే అలా అర్థం అవుతాయి. అతడు - పరమాత్మ, నేను అనేది- జీవాత్మ . జీవాత్మ పరమాత్మ లో కలిసి పోవడానికి తహతహలాడుతుంది.

అతడెక్కడున్నాడో తెలియదు, ఇంతకీ *నేనెవరిని* అనే ప్రశ్నకు జవాబు లేదు. నిజమే కదా! తెలియదు. అందుకే *అహం బ్రహ్మాస్మి* అనే మహా వాక్యానికి మూలం. 


        వైవిధ్యాన్ని, సౌందర్యాన్ని దర్శింపజేసే రూపంగా రుబాయిలకు పేరుంది. తెలుగు రుబాయిల ప్రయోక్తగా మహాకవి దాశరథి ప్రసిద్దులయ్యారు. ఆ పరంపరలో ఎందరెందరో కవులు రుబాయిలను రాశారు. మనకు మూల మలుపులో మిణుకు మిణుకు మనే జ్ఞాపకాన్ని పలకరించి స్పర్శించిన అనుభూతిని డా ఏనుగు నరసింహారెడ్డి గారు ఆలోచనాత్మకమైన తెలంగాణ రుబాయిలుగా మలిచారు.  కవి సునిశిత, కవిత్వ గుణానికి ఒక్కోరుబాయి ప్రాతినిధ్యం వహించింది.

 

      నరసింహారెడ్డి గారి రూబాయిల్లో తెలంగాణ తనం ఉంది, తెలంగాణ భాష ఉంది. తెలంగాణ జన సామాన్యం వాడుకునే చాలా పదాలు ఉన్నాయి.  వారు ఈ రుబాయిలు రాసే నాటికి తెలంగాణా రాష్ట్రం కోరి ఉద్యమం నడుస్తున్నది. వారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత కోరి కూడా రుబాయిలు రచించారు.  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం రచనలు చేసిన వందలాది, వేలాదిమంది కవులు ఉన్నారు తెలంగాణ లో. ఆ త్రోవలో నరసింహారెడ్డి గారు కూడా ఒకరు.  వారు ఈ రుబాయిలకు *తెలంగాణ రుబాయిలు* అనే పేరు పెట్టింది ఇందుకోసమే.

ఎవరో నొచ్చుకుంటారు అని కవి కవితలు రాయకుండా ఉండడు. కొందరి మెప్పు కోసమని మాత్రమే కావాలని నిజమైన కవి రాయడు. ఒక సత్యాన్ని ఆవిష్కరింప చేయడమే కవిత్వం పరమ ప్రయోజనం. అందుకే నరసింహారెడ్డి గారు ఒక రుబాయిలో ఇలా అంటారు! 


    *అపుడెపుడో అన్నామని మనసులో పెట్టుకోకు*

*ఏదేదో విని ఉంటావ్  మది లోపల పెట్టుకోకు*

*చెప్పిన వన్నీ క్షమించేటి  రోజొకటి రానున్నది*

*రాలే పూలమే మనం మనసు కష్టపెట్టుకోకు.*

 

      రుబాయిలు రాసి మెప్పించడం  అంత ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ అందులో సఫలీకృతుడయ్యాడు నరసింహారెడ్డి. 

         ఈ తెలంగాణ రూబాయిల్లో 536 రుబాయిలు ఉన్నాయి. అందులో కొన్ని ముత్యాలు, కొన్ని రతనాలు, కొన్ని వజ్రాలు, కొన్ని వైడూర్యాలు, కొన్ని మరకతాలు, మరికొన్ని మాణిక్యాలు. ఏకంగా 300పేజీల  విలువైన గని ఇది! 

ఇవి చదువుతున్నంత సేపు మనల్నిమనంచదువుకోవచ్చు.

 

      శాస్త్ర సాంకేతికత పెరిగిన కొద్దీ మనిషికి- మనిషికీ మధ్య అంతరం పెరుగుతుంది.  పెరగాల్సింది అంతరం కాదు, మానవ సంబంధాల గాఢత అని చెప్తూ ఇలా అంటారు. 


 *మనిషిని గాయపర్చకు మళ్ళీ కలువలేం*

*నీతిని పాతరేయకు మళ్ళీ కలువలేం*

*ప్రేమించడం లో మునిగిపో ద్వేషించలేం*

*కరుణను జారవిడువకు మళ్ళీ కలువలేం* 

   

       నాగరికత నిర్మాణంలో మనిషి- మరో మనిషితో కలిస్తేనే ఇంత దూరం  ప్రయాణం జరిగింది. లేకపోతే నవ నాగరికత నిర్మాణం జరిగేది కాదు అంటారు, రెడ్డి గారు. 


     అక్షరాస్యత పెరుగుతున్న కొద్దీ అవినీతి పెరగటం ఆందోళన కలిగించే విషయం.  మానవ సంబంధాలు నీతి నిజాయితీ పై ఆధారపడి ఉంటాయి. కాబట్టి నీతిని పాతరేస్తే - మానవ సంబంధాల మనగుడే కష్టం అని అంటారు మరో చోట.


 *శిలలన్నీ శిథిలమౌను- శిలకీర్తియే నిలుచు*

*కమ్మలెల్ల జీర్ణ మౌను- కావ్యావనియే నిలుచు*

*కుడి యెడమలకు చూడకుండా పరుగెత్తును  కాలఝరి*

 *ఆటుపోటులుంటైగని మంచి తామే నిలుచు*


ఈ వాక్యాల్లో నాకు జాషువా గారి ఫిరదౌసి కావ్యం లోని మాటలు గుర్తుకొచ్చినయ్

 

 *రాజు మరణించు నొకతార రాలిపోయె*

*కవియు మరణించు నొకతార  గగనమెక్కే*

*రాజుజీవించు రాతి విగ్రహముల యందు*

*సుకవి జీవించు ప్రజల నాలుకల యందు* 


అన్నట్లు శిలలు కాలక్రమేనా శిథిలం అవుతాయి.  కానీ శిల్పి- శిల్ప నైపుణ్యం శిథిలం కావు అంటారు.

వైవిధ్య భరితం అనుభూతుల మాల అయి మన  మనస్సుల్లో  ఏనుగు నరసింహారెడ్డి గారు ఈ *తెలంగాణ రుబాయిలు* జీవనదిలా  ప్రవాహమై సాగుతుూనే ఉంటాయి.


       నరసింహారెడ్డి గారు మంచి వచన కవి, పద్య కవి, వ్యాస కర్త మరియు అనువాదకులు కూడా.

 తెలంగాణ రుబాయిలు నిండైన, నికార్సైన తెలంగాణా మట్టి వాసన చూసిన, ఆస్వాదించిన  గ్రంథము. పుస్తకం ఆ మూలాగ్రం మనిషి జీవిత కాలంలో చూసిన, ఎదుర్కొన్న ఘటనలు, సన్నివేశాలు, జీవన చిత్రణ కండ్లకు  కట్టినట్లుగా రాసి చరితార్ధులు అయ్యారు. వారు  మరిన్ని రచనలు చేసి ఉన్నతోన్నత స్థానాన్ని చేరుకోవాలని పాఠకులుగా మనందరం కోరు కోవడం అనివార్యం.


*ఆధార గ్రంథాలు*

   1.తెలంగాణ రుబాయిలు (ఏనుగు నరసింహారెడ్డి) 

2.  పానశాల (దువ్వూరి రామిరెడ్డి)

3. దాశరధి రుబాయిలు- గజల్లు (డాక్టర్ తిరుమల

 శ్రీనివాసాచార్య)

4. ప్రపంచపదులు  (డాక్టర్ సి నారాయణ రెడ్డి)

No comments:

Post a Comment