ఆమె లేకపోతే..
జననం లేదు !
ఆమె లేకపోతే..
గమనం లేదు !
అన్నీ తానై..
అన్నింటా తానై..
అడుగు ముందుకు వేస్తూ..
నేటి ఆధునిక మహిళ
తనకు సాటి లేరంటూ..
మేటిగా అంతరిక్షానికి దూసుకెళుతు..
అనంత శక్తి స్వరూపిణియై
సగ భాగము నుండి
అగ్ర భాగానికి చేరుకుంది.
సంప్రదాయాల హద్దుల్లో ఉంటూ..
నిండుపున్నమి జాబిలి తానై..
రెండిళ్ళల్లోనూ వెలుగులు నింపుతూ..
అనుబంధాల రథాన్ని ముందుకు నడిపిస్తూ..
బాధ్యత అనే పదానికి
ప్రాణం పోస్తున్నది.!
అలుపెరగని యోధురాలు
నేటి మహిళ
విశాల ప్రపంచాన్ని
విజయాలతో నింపి,
వీరవనితై నిలుచుచున్నది.
బహుముఖప్రజ్ఞతో
బాధ్యతలు పోషిస్తూ..
దేశ ప్రగతి రథాన్ని
ముందుకు నడిపిస్తూ..
అనంత విశ్వాన్ని సైతం
అవలీలగా ఏలేందుకు అతివ సిద్దమౌతున్నది.
అణిచివేతను అధిగమించి,
అధికార పగ్గాలు సాధించి,
అపరకాళికలా
శత్రువు గుండెల్లో గుబులు పెంచుతున్నది.
మాతృభూమి రక్షణకై
మంచుకొండల్లో సైతం పహరా కాయుచున్నది
ఓ మహిళా నీకు జోహార్ !
-పరమేశ్వరాచార్య గుగ్గిళ్ళ
No comments:
Post a Comment