RASHTRAPATHI NILAYAM, Hyderabad.
చూడాల్సిన చారిత్రక పర్యాటక కేంద్రం-- రాష్ట్రపతి నిలయం!
-- డాక్టర్ మామిడి హరికృష్ణ 8008005231
రాష్ట్రపతి నిలయం అనే పేరే ఒక లాంటి వైబ్రేషన్! భారత రాజ్యాంగ అధినేతగా అత్యంత ఉన్నత స్థానంలో ఉండే ప్రముఖ పదవిగా, భారతదేశ సార్వభౌమత్వానికి ప్రతినిధిగా ఉండే పదవి గా మనకు తెలుసు. అలాంటి రాష్ట్రపతి సాధారణంగా ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో ఉంటాడనే విషయం కూడా మనకు తెలుసు. ఐతే రాష్ట్రపతి కి ఢిల్లీ తో పాటు, వేసవి విడిదికి, శీతాకాల విడిది కి వేర్వేరు సందర్భాలలో, దేశంలోని వేర్వేరు ప్రాంతాలలో ఆయన స్థాయికి, ఆ పదవిలోని ఔన్నత్యాన్ని కి గంభీరంగా ఉండేలాగా కొన్ని నివాసాలని భారత దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. వాటిలో దక్షిణాదిలో ఏర్పాటైన రాష్ట్రపతి నివాసం-- రాష్ట్రపతి నిలయం!
నాలుగు విడిదులు::
రాష్ట్రపతి నివాసం ఉండడానికి ఢిల్లీ, హైదరాబాద్ మాత్రమే కాకుండా, హిమాచల ప్రదేశ్ లోని మాషోబ్రా లో "రాష్ట్రపతి నివాస్ " పేరిట రాష్ట్రపతి విడిది కేంద్రం ఉంది.
ఇది 1850 ప్రాంతంలో నిర్మించడం జరిగింది.
అలాగే "రాష్ట్రపతి నికేతన్" అనే పేరిట ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ లో ఒక నివాసాన్ని నిర్మించారు. ఇది 1920ల్లో నిర్మాణమైంది.
ఇలా రాష్ట్రపతి దేశవ్యాప్తంగా నివాసం ఉండటానికి నాలుగు ప్రాంతాలలో నాలుగు విడిది కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటిలో రాష్ట్రపతి భవన్ ఢిల్లీ తర్వాత ప్రాచీనత విషయంలోనే కాకుండా ప్రాముఖ్యత దృష్ట్యా పేరెన్నికగన్న ఆవాసం మాత్రం ఖచ్చితంగా రాష్ట్రపతి నిలయం హైదరాబాద్ దే!
Residency House నుండి రాష్ట్రపతి నిలయం::
నిజానికి ఇది సికింద్రాబాద్ నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉండే బొల్లారంలో నిర్మాణమైంది. ఈ రాష్ట్రపతి నిలయం తనకి తాను ఒక చరిత్రగా, సంప్రదాయానికి కొలువు గా ఉండటం విశేషంగా అనిపించింది.
1850 ప్రాంతంలో మొదలెట్టి, 10 ఏళ్ళ కు 1860 లో దీని నిర్మాణం పూర్తయింది. దీనిని ఆనాటి నిజాం నాజిర్ ఉద్ దౌలా నిర్మించారు. నిజానికిది అప్పట్లో బ్రిటిష్ ప్రతినిధి ఉండడానికి వీలుగా నిర్మించడం జరిగింది. అందుకే అప్పట్లో దాన్ని "రెసిడెన్సి హౌస్" అని పిలిచేవారు. ఎందుకంటే అప్పుడు నిజాం ప్రభుత్వానికి బ్రిటిష్ వైస్రాయ్ కి మధ్య "సైన్య సహకార ఒడంబడిక" జరిగింది. దానిలో భాగంగా బ్రిటిషు సైన్యం ఇక్కడ కంటోన్మెంట్ ఏరియాలో ఒక క్యాంప్ ను ఏర్పాటు చేయడం, వారు వివిధ పిరంగి, తుపాకులు రైఫిల్స్ షూటింగ్, ఆయుధాలలో శిక్షణ ఇవ్వడం చేసేవారు.
హైదరాబాద్ నిజాం రక్షణ సాకుగా, ఆ పేరుతో బ్రిటిష్ కంటోన్మెంట్ సైనిక యంత్రాంగమంతా ఇక్కడ తిష్ట వేసిందన్న మాట. దాని కేంద్రంగా రెసిడెన్సి హౌస్ ఉండేది.
అందుకే ఈ భవన నిర్మాణ రీతులు, అక్కడ ఉన్న ఇతర కట్టడాలన్నీ "ఇండో ఇస్లామిక్ అండ్ యూరోపియన్ స్టైల్ "తో ఉండటం విశేషం!
కట్టడాలు, భవనాలు, నిర్మాణాలు, ఆలయాలు ఆయా కాలాల నాటి చరిత్రని, వారసత్వాన్ని, వాస్తు శిల్ప రీతుల ఔన్నత్యాన్ని వెల్లడి చేసే భౌతిక ఆధారాలు అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. అలానే 170 సంవత్సరాల పైగా చరిత్ర ఉన్న ఈ రాష్ట్రపతి నిలయం లోని ప్రతీ ఇసుక రేణువు కథలు కథలుగా ఎన్నో విషయాలు చెబుతుంది.
ఇది మొత్తం 90 ఎకరాల ప్రాంతంలో విస్తరించి ఉంది.
కాగా రాష్ట్రపతి నివాసం ఉండే ప్రధాన భవనం లో మొత్తం 16 గదులు ఉన్నాయి. Southern sojourn గా పిలిచే ఈ భవనంలో రాష్ట్రపతి విడిది చేసినపుడు రాష్ట్రపతి తో పాటు వారి పర్సనల్ అధికార యంత్రాంగం వుండడానికి వీలుగా ఈ గదులు ఏర్పాటు అయ్యాయి. దానికి తోడు ఈ భవనంలో ఒక ప్రధాన ఆకర్షణ "డైనింగ్ హాల్ "అని చెప్పొచ్చు. రాష్ట్రపతి భోజనం చేయడానికి వీలుగా ఏర్పాటైన ఈ డైనింగ్ హాల్ కు దిగువన "కిచెన్ టన్నెల్" ఏర్పాటు కావడం విశేషం. నాకు తెలిసి వంట చేసిన పదార్థాలను డైనింగ్ హాల్ కు తీసుకురావడం కోసం ఒక సొరంగం లాంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకున్న ఒకే ఒక భవనం బహుశా ఈ రాష్ట్రపతి నిలయమే!
అప్పట్లో డైనింగ్ హాల్ కు కిచెన్ దూరంగా ఉండేది. వంటశాలలో వండిన పదార్థాలన్నీ చాలా పకడ్బందీగా అత్యంత రక్షణతో అక్కడి నుండి టన్నెల్ ద్వారా నేరుగా డైనింగ్ హాల్ కి తీసుకొచ్చే ఫెసిలిటీ ని ఇక్కడ రూపొందించారు. అయితే కాలక్రమంలో ఈ మార్గం నిరుపయోగమై పోయింది.
మూసివేసిన ఈ టన్నెల్ ను 2020 లో పునః ప్రారంభించాలని అనుకున్నారు. అలా దానిని పునరుద్ధరణ చేసి ఇప్పుడు సందర్శకుల కోసం అనుమతించారు. అయితే ఆ టన్నెల్ లోని గోడలను ఖాళీగా ఉంచకుండా సుందరీకరించాలని 2023లో అనుకుని ఆ గోడలపై తెలంగాణా సంస్కృతి ప్రతిబింబించే చేర్యాల నకాష్ చిత్రాలు చిత్రించారు. Ajanta cave paintings, Vatican St Peter's Basillica గోడల పైన వేసిన fresco paintings మాదిరిగా ఆ గోడల పైన నకాషీ పెయింటింగ్స్ చిత్రించారు.
ఇక రాజసం, వైభవం, చారిత్రకత, అధికారంల నిదర్శనంగా నిలిచిన రాష్ట్రపతి నిలయం లో కొన్ని ప్రముఖ స్థలాల విశేషాలు::::.
1. FLAG POST:: జాతీయ పతాకం ఆవిష్కరించే ప్రత్యేక ప్రదేశం ఇది.1948 లో 120 అడుగుల ఎత్తులో బర్మా టేక్ తో రూపొందించబడిన జాతీయపతాక కేంద్రం ఇది.
1948 సెప్టెంబర్ 17 నాడు హైదరాబాద్ రాజ్యం భారత దేశంలో విలీనం అయిన సందర్భంగా జనరల్ జయంతినాధ్ చౌదరి త్రివర్ణపతాకాన్ని తొలిసారిగా ఆవిష్కరించి విలీనాన్ని సంకేతాత్మకంగా ప్రపంచానికి చాటి చెప్పిన ప్రదేశం ఇది..... అందుకని ఇది భారతదేశ సార్వభౌమత్వానికి హైదరాబాద్ రాజ్య స్వతంత్రతకు చరమ గీతం పాడి, విలీనత్వానికి తెర లేపిన సంకేత స్థలంగా నాకనిపించింది.
2) Jai Hind Step Well అనే భారీ మోట బాయి:
నన్ను చాలా ఆకట్టుకున్న నిర్మాణాలలో భారీ మోట బాయి ఒకటి. step wells అని కూడా అంటున్నారు. గతంలో తెలంగాణ ప్రాంతంలో కరెంటు, ఇతర మోటార్ పరికరాలు లేని సందర్భంలో బావిలోంచి నీళ్లను ఎత్తిపోయడానికి ఉపయోగించిన ప్రాచీన సంప్రదాయ నీటి పారుదల విధానం ఇది. లోతైనబావిలో ఉన్న నీటిని పెద్ద పరిమాణంలో పైకి తోడటానికి భారీ ఇనుప గంగాలాన్ని తాళ్ళతో కట్టి బావిలోకి దింపి, ఆ గంగాలం నీళ్లతో నిండిన తర్వాత, దానికి కట్టిన తాళ్ళను ఎద్దుల కాడితో అనుసంధానించి, ఎద్దులను "మోట " లోకి ముందుకు నిండిపించడం ద్వారా బావిలోపల నీళ్లతో నిండి ఉన్న గంగాలం ను పైకి తీసుకు వస్తారు. అయితే ఈ గంగాలంలోని నీళ్లు బావిలోంచి పైకి వస్తున్నపుడు కారిపోకుండా తోలు తిత్తి ని గంగాలానికి ఒక వైపున బిగించి, దానికి ఎద్దుల కాడితో తాళ్ళతో అనుసంధానిస్తారు.
దీని వల్ల ఏక కాలంలో గంగాలం బావి లోని నీళ్లలోకి మునిగేపుడు నీళ్లు గంగాలం లోకి సులువుగా ప్రవేశించి, నిండిన తర్వాత పైకి లాగుతున్నపుడు తోలు తిత్తి మూసుకుపోయి నీళ్లు జారిపోకుండా నిరాటంకంగా పై వరకు వస్తాయి. అలా పైకి తెచ్చిన నీటిని ఒక చిన్న తటాకం లో నిల్వ చేసి, ఆ తర్వాత పొలంలోకి లేదా చేన్లలోకి నీటిని పారిస్తారు.
అయితే ఇక్కడి మోటబావి చాలా పెద్దది. సాధారణంగా ఎక్కడైనా మోటబాయి, కాడి మోస్తున్న రెండు ఎద్దులు నడవడానికి వీలుండే ప్రదేశంలో మాత్రమే ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం మూడు జంట ఎద్దులు ఏకకాలంలో ఆ బావిలో నీళ్ళు పైకి తోడడానికి వీలుగా ఉండే అంత విశాలంగా ఉండటం ఆశ్చర్యమనిపించింది. నాకు తెలిసి తెలంగాణ ప్రాంతం మొత్తంమీద బహుశా అతిపెద్ద మోటబాయి ఇదేనేమో!
అయితే ఈ మోటబాయి కాలక్రమేణా పూడుకుపోయి, మూసుకుపోయి శిధిలమైపోయింది. దాన్ని ఇటీవలి కాలంలోనే పునరుద్ధరించి ఇప్పుడు ఒక మోడల్ గా ప్రదర్శన విశేషంగా చూపిస్తున్నారు. దీని పైన నిర్మించిన ramp భూమికి 45°కోణంలో వాలుగా నిర్మిస్తున్నపుడు, ఒక వైపున చింత చెట్టు ఉంటే, దానిని కొట్టి వేయకుండా ఆ ramp లో ఒదిగిపోయేలా చక్కగా కలుపుతూ ఈ నిర్మాణాన్ని పునరుద్ధరించారు.
దాని వల్ల తెలంగాణ ప్రాంతంలో దాదాపు 170 సంవత్సరాల క్రితం పంటలు పండించడానికి, వ్యవసాయం చేయడానికి ఎలాంటి నీటిపారుదల వ్యవస్థని ఎంత నైపుణ్యంతో నిర్మించుకున్నారో ఆధారాలతో సహా చెప్పడానికి ఈ మోటబావి ఒక అద్భుతమైన సజీవ ఉదాహరణగా నిలుస్తుంది అని నేను భావిస్తాను.
3) నక్షత్ర వాటిక :
ఇటీవలి కాలం అనే కాకుండా చాలా కాలం నుంచి భారతీయుల జీవన సంస్కృతిలో జన్మ నక్షత్రాలు, జాతక చక్రం, జ్యోతిషశాస్త్రం వంటి వాటి పట్ల అమితమైన ఆసక్తి, విశ్వాసం ఉంది. అయితే ఆయా నక్షత్రాలలో జన్మించిన వ్యక్తులకి శుభాలను, మేలును చేకూర్చే శక్తి గ్రహాలు, అంతరిక్షం లో మాత్రమే కాక, భూమి పైన మన చుట్టూ ఉండే ప్రకృతి పరమైన చెట్ల జాతులకి కూడా ఉంటాయనేది ఒక గమ్మత్తయిన నమ్మకం. దీనిని నేపథ్యం గా చేసుకుని రాష్ట్రపతి నిలయంలో "నక్షత్ర గార్డెన్" అనే పేరిట ఒక తోట ని ఏర్పాటు చేసారు. దీంట్లో భారతీయ జాతక శాస్త్రం లో ఉన్న మొత్తం 12 రాశులు, 27 జన్మ నక్షత్రాలు, 9 గ్రహాలు తో, ఏ నక్షత్రానికి ఏ ఏ చెట్టు జాతి అనుకూలంగా ఉంటుంది అనే "పురా శాస్త్రీయ దృక్పథం"తో ఈ నక్షత్ర వాటిక ని ఏర్పాటు చేశారు.
4) అమ్మవారి ఆలయం:
దాని పక్కనే దుర్గ భవాని ఆలయం కొలువై ఉంది. అమ్మవారు కొలువైన ఆలయం
ప్రజలకీ, వచ్చే సందర్శకులు అందరికీ కూడా ఆశీస్సులు ఇస్తున్నట్టుగా ఉంటుంది.
5) Herbal Garden:
ఇక దానికి కొద్ది దూరంలోనే వన మూలికల తోట ఒకటి ఉంది. భారతీయ వైద్య విధానంలో ఆయుర్వేద, ప్రాకృతిక చికిత్స లో ఉపయోగించే అరుదైన అద్భుతమైన 116 జాతులకు సంబంధించిన చెట్లను ఒకే చోట హెర్బల్ గార్డెన్స్ అనే పేరిట ఏర్పాటుచేశారు. దాంట్లో ప్రతి ఒక్క జాతీ చెట్టు, మనిషి ఎదుర్కొనే వివిధ రకాల రోగాలు, వ్యాధుల నివారణకు ఉపయోగించే చెట్ల జాతులు గా ఉండటం విశేషం.
ప్రకృతిలో అంతర్భాగంగా ఉన్న మానవుడు ప్రకృతిని ధిక్కరించి, ప్రకృతిని అధిగమించి, తను సృష్టించుకున్న కాంక్రీట్ జంగిల్ లోకి వెళ్ళిపోయి తనని తాను కోల్పోయాడనేది కాదనలేని సత్యం. ఇలా తను ఏమి కోల్పోయాడో తెలుసుకోవడానికి ఈ వనం ఉపయోగపడుతుంది. ప్రకృతిలో ఉన్నంతకాలం మానవుడిని ఏ వ్యాధి, ఏ రోగము పెద్దగా బాధించిన దాఖలాలు లేవు. కానీ ప్రకృతికి ఆవల వెళ్ళినప్పుడు మాత్రమే మానవుడికి సకల సమస్యలు, రోగాలు వచ్చిన స్థితిని మనం చూస్తున్నాం. అందుకని ఇక్కడికి వచ్చే సందర్శకులకి ప్రకృతిలో అంతర్భాగంగా ఉండటం వల్ల జరిగే ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఏంటో ఈ చెట్లు మనకు చెప్పకనే చెబుతున్నట్లుగా అనిపిస్తుంది.
6) Amphi Theatre::
హెర్బల్ గార్డెన్ కు stepwells అనబడే మోటబావి ప్రాంతానికి మధ్య ఓపెన్ ప్రదేశంలో ఒక యాంఫీ థియేటర్ ని నిర్మించారు. ఈ యాంఫీ థియేటర్లో ప్రతీ వీకెండ్ వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
దాదాపు 100 మంది ప్రేక్షకులు
కూర్చొని చూసే అవకాశం ఉన్న ఈ థియేటర్ బ్యాక్ డ్రాప్ గా step well arches కనిపిస్తాయి. దీనికి తోడు చుట్టూ ఉన్న ప్రాకృతిక సౌందర్యం ఎంతో గొప్పగా అనిపిస్తుంది.
7) మ్యూజియం :
శతాబ్దాల కాలం క్రితం నుంచి ఈ రెసిడెన్సీ కి అవసరమైన నీటిని అందించే ఈ మోట బావులలో ఉపయోగించిన వివిధ వస్తువులు, పరికరాలు, బిందెలు, గంగాళాలు, ఇతర సామాగ్రి అంతటినీ ఒకచోట భద్రపరిచి సందర్శకులకు ఆ కాలం నాటి పరికరాల పరిచయం కోసం ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు.
ఇందులో గోడకి వివిధ రకాల బిందెలను అమర్చిన తీరు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కాగా ఈ బిందెలు, గంగాళాలు అన్ని ఇనుముతో తయారవడం విశేషం.
8) టీవీ హాల్ :
ఈ నాలెడ్జ్ సెంటర్ కు పక్కనే పది మంది కూర్చొని చూసే వీలుండే ఒక ఆడియో విజువల్ రూమ్ ని ఏర్పాటు చేశారు. ఇందులో గోడ కు అమర్చిన టీవీ స్క్రీన్ లో రాష్ట్రపతి నిలయం కు సంబంధించిన వివిధ అంశాల వీడియోని ప్రదర్శన చేస్తారు. ఈ గది లో పైకప్పు నిర్మాణం ఒక ఇంజనీరింగ్ విశేషం అని చెప్పవచ్చు. చుట్టూ గోడల తో కప్పబడి నప్పటికీ ఆ పై కప్పు నిర్మించిన తీరు, లోపలికి వెలుతురు ప్రసరించేలాగా నిర్మించడం ప్రత్యేకంగా కనిపిస్తుంది.
9) Rock Garden :
కొద్ది దూరంలో అక్కడ సహజంగానే రూపొందిన పెద్ద పెద్ద కొండలు, చిన్న రాళ్లగుట్ట లాంటి నిర్మాణాన్ని, వాటి సహజ రీతిలోనే ఎలాంటి విరూపణలు చేయకుండా వాటి చుట్టూ ల్యాండ్ స్కేపింగ్ చేయడం ద్వారా వాటికి ఒక ఒక సౌందర్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ ఒక ఆకర్షణ ఏమిటంటే, ఒక పెద్ద రాతి కొండపైనే శిల్పుల చేత శివ రూపమైన మేధా దక్షిణామూర్తి, నంది ప్రతిమలను చెక్కించి, ఆ కొండ పైనుంచి కృత్రిమంగా ఒక జలపాతాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 24 గంటలు రాళ్లగుట్ట మీద నుంచి కింది తటాకం వరకు నిరంతరం ప్రవహిస్తూ మేధా దక్షిణమూర్తిని, నందిని అభిషేకం చేస్తున్న అనుభూతిని కలిగిస్తాయి.
దాంతోపాటు ఆ చుట్టుపక్కల ఉండే చెట్లు అన్నీ అరుదైన జాతికి సంబంధించిన చెట్లు కావడం, బ్రహ్మ జముడు, నాగ జముడు, జట్రాప కార్కస్ లాంటి ఇతర జాతుల కు సంబంధించిన మొక్కలు ఉండడం గొప్పగా అనిపించింది.
10) ఇతర తోటలు:
ఇవే కాక "PALMATUM" అనే పేరుతో పామ్ చెట్ల లో ఉండే దాదాపు ఎనిమిది రకాలకు సంబంధించిన చెట్లు ఏర్పాటు చేశారు.
దాంతో పాటు సీతాఫలం, రామఫలం, ఆంజనేయ ఫలము, లక్ష్మణ ఫలం అని నాలుగు రకాల సీతాఫల జాతికి సంబంధించిన చెట్లు అన్నీ ఒక చోట ఉండటం ఆశ్చర్యం అనిపిస్తుంది.
అలాగే జామ, ఉసిరి తోటలు, వివిధ రకాల మామిడి జాతులతో కూడిన తోట చాలా అద్భుతంగా ఉంటుంది.
మరొకవైపున తెలంగాణ ప్రభుత్వం పక్షాన రూపొందిన హరితహారం లో అంతర్భాగంగా దాదాపు 14 వేల మొక్కలు రాష్ట్రపతి నిలయంలో అప్పుడు నాటారని తెలిసింది. ఇప్పుడు చాలా విస్తారమైన చెట్లు, వన సంపద తో ఆకర్షణీయంగా ఉంటుంది.
Talking Tree :
కొన్ని వందలాది సంవత్సరాల చరిత్ర కి మౌన సాక్షిగా నిలిచిన ఒక మర్రి చెట్టు ఇక్కడ ఉంది. ఊడల మర్రి చెట్టు వద్ద సౌండ్ సిస్టం ను ఏర్పాటు చేసి అందులోంచి ఒక రికార్డెడ్ వాయిస్ ను వినిపిస్తారు. ఇది ఒక విధంగా sound & light show లాంటిది. సందర్శకులు అందరికీ రాష్ట్రపతి నిలయం విశేషాలని చెప్పడానికి మర్రిచెట్టునే ఒక వ్యాఖ్యాత గా మారిపోయి తన ఆత్మకథగా అక్కడి చారిత్రక, వాస్తు శిల్ప విశేషాలను అందిస్తుంది. ఈ టెక్నీక్ ముఖ్యంగా విద్యార్థులకు, యువకులకు చాలా ఆసక్తికరంగా ఉందని చెప్పవచ్చు.
సందర్శనా స్థలం:
కాగా ఇది 2023 నుంచి ప్రజలకు నగర పౌరులందరికీ సందర్శన కోసం ఓపెన్ చేసి పెట్టడం జరిగింది ఇది ఎవరైనా ఆసక్తి ఉన్నవారు ఎవరైనా ఏ రోజైనా ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా సందర్శించవచ్చు. హైదరాబాదులో సందర్శించదగిన, చారిత్రిక వాస్తు శిల్ప రీతికి సంబంధించిన నిర్మాణాలలో రాష్ట్రపతి నిలయం కూడా ఒకటి గా మన మిత్రులకు గర్వంగా చెప్పవచ్చు...
---- డాక్టర్ మామిడి హరికృష్ణ
8008005231
No comments:
Post a Comment