ఒడువని ముచ్చట
-----------------
ఈ పోస్టులో నింద అందరిమీద కానేగాదు,
అందరి మధ్యనున్న కొందరు మందబుద్ధుల కోసమే
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
గారెను--
చెక్క,బిళ్ల అని మారుపేరుతో పిల్చేది
తింపితింపి కొడితె ఒకటిరెండు వర్గాలవారే.
తెలంగాణలోనూ ఈ పేర్లతో పిలిచేవారున్నా,
వారు మరెవ్వరిని పల్లెత్తి మాట అననే అనరు.
అట్లా అనకపోవుడన్న ముచ్చట ఈ మట్టిగుణం.
సామాజికవర్గాల మధ్య వైవిధ్యం..
ప్రాంతాలమధ్య మధ్య వైవిధ్యం..
వలసవాద ఆధిపత్యం వల్ల న్యూనతకు నెట్టబడి,
మేలిమి భాషాసంస్కృతులకు మాననిగాయమైంది.
తమదే సరైనదనే తమకంతోటి
మిగతా అందరినీ కలిపి కట్టగట్టి
తమను అనుకరించేటట్టు చేసిండ్రు.
కొంగొందరి అహంకారం & అజ్ఞానం
అతిపెద్ద సమూహపు ఆత్మగౌరవాన్ని
దెబ్బతీసే విధంగా చరిత్ర కొనసాగింది.
ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉన్నది.
అనేకాకనేక విషయాల్లో రోజూ ఇదే తంతు.
గారెలు రెండు రకాలు.
1. పిండి గారెలు (గట్టి గారెలు)
2. పప్పు గారెలు (మెత్తటి గారెలు)
పిండిగారెలకు---
బియ్యం, జొన్నలు, సజ్జలు, గోధుమలు..
ఏవైనా పిండిపట్టించి వాడుతారు.
తెలంగాణలో గంపలకొద్ది చేసుకుని,
నెలరోజులపాటు తినేవి ఇవే గారెలు.
మా దగ్గర 99% జనాభాకు గారెలంటే ఇవ్వే.
మరోమాటే లేదు. వేరే మాటేదీ స్ఫురించదు.
వీటినే కొంచం మందంగ చేస్తే ఓడప్పలు అంటరు.
ఓడప్ప(వడప్ప)లంటే పప్పుతో కాకుండ
పిండితోటిగుడ చేస్తరని మనకు తెలియదాయే.
పప్పు గారెలు---
పెసర, బబ్బెర, అలసంద, శెనిగలు
(అరుదుగా మాత్రమే మినుపపప్పు)
మొదలైనవి నానబోసి పిండిరుబ్బి చేసేవి.
పిండిగారెలు/గట్టిగారెలకు తీరొక్కపేర్లు...
1. గారెలు (గారెలు అని రూఢీ)
2. బిల్లగారెలు
3. చెక్కలు
4. అద్దాల గారెలు
(ఇంకొన్ని పేర్లూ ఉండే ఉండవచ్చు)
పప్పుగారెలు/మెత్తటిగారెలకు తీరొక్కపేర్లు...
1. ముద్ద గారెలు (అరచేతులలో గుండుగ చేసేవి)
2. చేతి గారెలు (ఒక్క చేతివేళ్లమీద మీద ఒత్తి చేసేవి)
3. ఒత్తుడు గారెలు (పొడి బట్టపరిచి బట్టమీద ఒత్తి చేసేవి)
ఈ పేర్లేవీ తెలియనంతకాలం
తాము మాట్లాడేదే గొప్పనిపిస్తది.
ఆహారచరిత్ర విశేషాలలో వైవిధ్యం తెల్వదు.
మనమేందో - మన మినుపగారేందో.. అంతే.
ఎక్కడైనా ఎప్పుడైనా పేర్లుతీర్లు కనబడ్డ దగ్గర
కొంచం శ్రద్ధ చూపుతరా అంటే అది గుండుసున్న.
గతంలోనూ ఇదే వేదికమీద ఇదే రకంగా...
ఈ పేరు,ఈ ముచ్చట చాలాసార్లు చెప్పుకున్నము.
కానీ గాక, తమదే అసలైన భాషనే ఎడ్ఢితనంతో
చాలామంది పట్టించుకోకుంటనే కొట్టిపారేస్తరు.
అటువంటి వారు ఏనాటికైన భంగపడక తప్పదు.
తనకన్న తెల్వాలెనట - ఒగరు చెప్తెనన్న వినాలెనట !
-డా. మట్టా సంపత్కుమార్ రెడ్డి
No comments:
Post a Comment