పుస్తకం
విజ్ఞాన కాంతుల్ని ప్రసరించే
అక్షర రత్న పేటిక
కోట్లాది మెదళ్లను రగిలించే
చైతన్య దీపిక
తరతరాల చరిత్రను
తన గుండెల్లో నింపుకొని
భావితరాలకు అందించే
విజ్ఞాన కలిక
జీవపరిణామాన్ని
విశ్వ వీధుల నిగూఢత్వాన్ని
పంచభూతాల స్వాభావికతను
సమస్త విషయ పరిజ్ఞానాన్ని
అక్షరాక్షరాన నిబిడీకరించుకున్న
రసోద్దీపన వాక్య తంత్రిక
జీవన వేదాన్ని నిర్వేదాన్ని
అమృతత్వాన్ని మృతత్వాన్ని
అల్పత్వాన్ని అనల్పత్వాన్ని
సూక్ష్మాన్ని స్థూలాన్ని
వ్యక్తిగతాన్ని సమిష్టిగతాన్ని
ఒకటేమిటి? సమస్తమును
పద పదాన ఇముడ్చుకున్న
విషయ భాండాగారం
అమ్మ దనంతో పాటు కమ్మదనాన్ని
మానవతా పరిమళాల్ని గుబాళింప జేసే
జ్ఞాన సుమమాలిక
పుస్తకం
సమస్త మానవాళికి మూడో కన్ను
జ్ఞానాగ్నిని ప్రజ్వరిల్ల జేసి
అజ్ఞానాన్ని కాల్చివేయడమే కాదు
విజ్ఞానసుధల్ని కురిపించి
వివేకత్వాన్ని ప్రసాదించగలదు
(ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా…)
- డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య
No comments:
Post a Comment